International

పక్కా ప్లాన్ తోనే చైనా ప్రభుత్వం ఆ జర్నలిస్టును చంపేయబోతోందా..?

చైనాలోని వూహాన్ లో కరోనాకు పుట్టినిల్లు..! చైనా ఇతర దేశాల మీదకు జీవాయుధంగా కరోనా వైరస్ ను వదిలిందన్నది పెద్ద ఎత్తున వాదిస్తూ ఉన్నారు. వూహాన్ లో కరోనా వైరస్ పుట్టిందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వాళ్లను చైనా ప్రభుత్వం అంతం చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే వూహాన్ ల్యాబ్ లో పని చేస్తున్న వాళ్ల మరణాలు మిస్టరీగా ఉన్నాయి.. మరికొందరు ఎక్కడికి వెళ్లిపోయారో.. ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితి. ఇక జర్నలిజానికి ఇప్పటికే తూట్లు పొడిచిన చైనా కమ్యూనిస్టు సర్కారు.. వూహాన్ లో ఏమి జరుగుతుందో తెలియకుండా చేయడానికి జర్నలిస్టులపై కూడా ఉక్కుపాదం మోపింది.

వూహాన్ లో కరోనా వైరస్ ప్రబలిన తొలినాళ్లలో కరోనా పరిస్థితులను కవర్ చేసిన సిటిజన్ జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్ (38) ఇప్పుడు చావుకు చాలా దగ్గర్లో ఉన్నారు. వృత్తి రీత్యా ఆమె లాయర్ అయిన ఆమె.. 2020 ఫిబ్రవరిలో వూహాన్ కు వెళ్లి కరోనాకు సంబంధించిన వాస్తవాలను కవర్ చేయడం మొదలు పెట్టింది. అక్కడి దారుణ పరిస్థితుల గురించి వీడియోలు తీసి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. ప్రభుత్వం తనపై తీసుకున్న చర్యలను నిరసిస్తూ జైల్లోనే ఆమె నిరసన దీక్షకు దిగారు. ఆహారాన్ని తీసుకోవడాన్ని ఆపేశారు. ప్రస్తుతం ఆమెకు ముక్కులో నుంచి ట్యూబుల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆమె లీగల్ టీమ్ కు కూడా సమాచారం లేదంటే.. ఆమె చనిపోయినా కూడా తమకు ఎటువంటి నష్టం లేదనే భావన చైనా తీరులో కనిపిస్తూ ఉంది. పక్కా ప్లాన్ తోనే చైనా ప్రభుత్వం ఆ జర్నలిస్టును చంపేయబోతోందనే వాదన కూడా బయటకు వస్తోంది. ఏదో ఒక సమయంలో ఆమె మరణవార్తను చైనా ప్రభుత్వం చెప్పే అవకాశం లేకపోలేదని అంటున్నారు. గతంలో ఇలా ఎంతో మందిని చైనా చంపేసిందని.. నిజాలు బయటపెట్టే వారిపై ఉక్కుపాదం మోపడం చైనాకు కొత్త విషయం కాదని అంటున్నారు. ఝాంగ్ ఝాన్ కూడా ఆమె బ్రతికే అవకాశాలు ఏ మాత్రం లేవని అంటున్నారంటే చైనా ధోరణి మనకు అర్థం అవుతుంది. ఆమె సోదరుడు ఝాంగ్ ఝూ స్పందిస్తూ రాబోయే రోజుల్లో ఆమె బతికే అవకాశాలు ఏ మాత్రం లేవని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తాను ఆమెకు చాలా లేఖలు రాశానని తెలిపారు. ప్రస్తుతం ఆమె తాను నమ్మిన సిద్ధాంతాలు, ఆమె నమ్మే దేవుడి గురించే ఆలోచిస్తోందని.. ఇతర విషయాలను పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆమెను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జైలు నుంచి విడుదల చేస్తేనే ఆమె నిరాహార దీక్షను ఆపుతుందని, అవసరమైన వైద్య చికిత్సను పొందుతుందని తెలిపింది. ఝాంగ్ ను నిర్బంధించడం మానవ హక్కులపై చైనా ప్రభుత్వం తీసుకున్న సిగ్గులేని చర్య అని ఆమ్నెస్టీ క్యాంపెయినర్ గ్వెన్ లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చైనా ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారెవరైనా శిక్షను అనుభవించాల్సిందేనని తెలిపింది. ఇలా చైనా ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులను చంపేసిందని.. మానవహక్కులు ఏ మాత్రం చైనా ప్రభుత్వం పట్టించుకోదనే విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + twelve =

Back to top button