జెలెన్‎స్కీ అజ్ఞానం.. ఉరికొయ్యపై ఉక్రెయిన్..!

0
824

నాయకుడంటే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలి. తక్కువలో తక్కువ ఇరవయ్యేళ్ళ విజన్‎తో దేశాన్ని అభివృద్ది చేసేవాడై ఉండాలి. ఎంతో ఆదర్శవంతమైన ఆలోచనలుంటేనే ప్రజల కష్టనష్టాలు తెలుస్తాయి. రాజకీయ అనుభవంలో ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఏవిధమైన వైఖరిని ఎంచుకోవాలన్నదానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. భారత్ లాంటి అతిపెద్ద దేశాల్లో.. 130 కోట్ల ప్రజలకు నాయకుడిగా ఎదగాలంటే ఎంతో అనుభవం ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఇంత మంది ప్రజల్లో నాయకుడిగా ఎదగాలంటే అపారమైన రాజకీయ మెలకువలుంటేనే సాధ్యం. అందుకే భారత్ లాంటి దేశాలకు యాభయ్యేళ్ళు వస్తే కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం అంత సులభంగా దక్కదు. అయితే చిన్న చిన్న దేశాల్లో మాత్రం ఇటువంటి పరిస్థితి ఉండదు. జనాభా తక్కువ కాబట్టి త్వరగానే ప్రజల మనసును గెలుచుకోవచ్చు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి అయితే ఇది మరీ సులభమవుతుంది. దీంతో వారిలో నాయకత్వ మెలకువలు అంతగా ఉండవు. దేశాన్ని నడిపే సామర్థ్యం ఏమీ ఉండదు. సరిగ్గా ఇదే పరిస్థితి ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‎స్కీకి ఎదురైంది.

జెలెన్‎స్కీ స్వతహాగా కమెడియన్. టీవీల్లోనూ, పాపులర్ షోలలో తన కామెడీతో ఉక్రెయిన్ ప్రజలందర్నీ మెప్పించేవాడు. అతడి కామెడీకి ప్రజల్లో మంచి పాపులారిటీ వచ్చింది. వీటన్నిటి కంటే ఉక్రెయిన్‎లోని పాలిటిక్స్‎పై సెటైర్లు వేస్తూ చేసిన ‘సర్వెంట్ ఆఫ్ ద పీపుల్’ అనే కామెడీ షో విపరీతమైన జనాదరణను సంపాదించుకుంది. దీంతో తన పాపులారిటీనే పెట్టుబడిగా చేసుకుని ఉక్రెయిన్‎లో గెలుపొందాడు. అధ్యక్షుడిగా అయితే విజయం సాధించాడు కానీ, దేశ పరిపాలనపై ఎటువంటి అవగాహన లేదు. అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఏ విధంగా ఉండాలి.. అగ్రదేశాలు పన్నే కుట్రలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఎలాంటి అవగాహన లేదు. దీంతో అమెరికా లాంటి దేశాలకు ఉక్రెయిన్ ఒక పావుగా దొరికింది. రష్యాను ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా అని చూస్తున్న అమెరికా.. యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతికి చిక్కడంతో మెల్లగా పావులు కదుపడం మొదలు పెట్టాయి అగ్రదేశాలు. ఉక్రెయిన్ ను నాటో దేశాల్లో కలుపుకుంటామని, రష్యా నుంచి పూర్తి స్వతంత్ర్యంగా ఉండొచ్చని నమ్మబలికాయి. ఒకవేళ యుద్దమే వస్తే అమెరికాతో పాటు నాటో దేశాలన్నీ యుద్దంలో పాల్గొని ఉక్రెయిన్ ను కాపాడుతాయని చెప్పడంతో నాటో లో చేరడానికి జెలెన్‎స్కీ ఒప్పుకున్నాడు. అయితే ఉక్రెయిన్ నాటోలో చేరడం రష్యాకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ నాటో లో చేరితే అమెరికా దళాలు తమ సరిహద్దులకు చేరుకుని ప్రతిరోజూ సమస్యగా మారతాయని రష్యా గ్రహించింది. దీంతో ఉక్రెయిన్ ను పలుసార్లు హెచ్చరించినా కూడా జెలెన్‎స్కీ వినలేదు. అమెరికా చెప్పుడు మాటలను విని ఉక్రెయిన్ ను యుద్దం వైపుగా నడిపాడు.

దీంతో ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ లో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉక్రెయిన్ వీధులంతా బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఉక్రెయిన్ దేశ ప్రజలంతా యుద్దంలోకి దిగి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. సరైన తిండి వసతి లభించక నానాయాతనలు పడుతున్నారు. దేశం మొత్తం బాంబులతో నాశనమవుతోంది. అప్పటివరకూ చేసిన అభివృద్ది అంతా పేకమేడల్లా కూలిపోతున్నాయి. అయితే అమెరికా యూరప్ లకు తాము అనుకున్న పని అయితే మొదలైంది. దీంతో ఉక్రెయిన్ తో తమకు అవసరం లేదు. కాబట్టి అప్పటి దాకా నాటో లో చేర్చుకుంటామని ఇచ్చిన హామీని కాస్తా వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఉక్రెయిన్ కు తోడుగా తాము యుద్దానికి వస్తామని ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేదు. దీనికి బదులుగా నాటో దేశాలు ఉక్రెయిన్ కు నామమాత్రంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. అయితే అవి కేవలం అమెరికా ఆయుధ లాబీలకు సహాయపడటానికే తప్ప మరొకటి కాదు. ఇంతజరిగినా నాటో దేశాల ద్వంద వైఖరిని గుర్తించాల్సిన జెలెన్‎స్కీ దీన్ని గుర్తించలేదు. అదే మొండివైఖరితో రష్యాతో పోరాడుతున్నాడు. ఉక్రెయిన్ ప్రజల్లో ఒక హీరో అనే భావనను పెంపొందించుకోవడానికి, తాము ఏ దేశానికీ లొంగకుండా పనిచేస్తానని చెప్పుకోవడానికి ఈ వృథా ప్రయాస చేస్తున్నాడు. రష్యా ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటి. దాన్ని ఎదుర్కోవడం తన వల్ల కాదని గ్రహించిన జెలెన్‎స్కీ కొన్ని దారుణ చర్యలకు దిగటం వంటివి చేశాడు.

ఇందులో ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేసి తిరిగి దాన్ని రష్యా నే చేసిందని ప్రపంచదేశాలను నమ్మబలికే చర్యలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ప్రపంచదేశాలన్నీ యుద్దంలో కొన్ని నియమాలు రాసుకున్నాయి. ఈ విధంగా రాసుకున్న నియమాల్లో జెనీవా ఒప్పందం కూడా ఒకటి. ఈ ఒప్పందంలో ఏ రెండు దేశాల మధ్యనైనా యుద్దం వస్తే అందులోని సాధారణ ప్రజలకు ఏ మాత్రం హాని కలుగకుండా ఇరు దేశాలూ చూసుకోవాలనే నిబంధన ఉంది. వారి సాధారణ జీవనానికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అయితే జెలెన్‎స్కీ ఇవేమీ పట్టించుకోకుండా పదే పదే సామాన్యుల జీవనానికి అడ్డుతగులుతూనే ఉన్నాడు. ఇటీవలే ఉక్రెయిన్ నుంచి ఐదు ప్రాంతాలను రెఫరెండం నిర్వహించి వాటిని స్వతంత్ర్య రాజ్యాలుగా రష్యా ప్రకటించగానే క్రిమియా ప్రజలకు జీవనాడి అయిన క్రిమియా బ్రిడ్జిని డ్రోన్ బాంబును పెట్టి పేల్చివేయించాడు జెలెన్ స్కీ. ఈ ఘటనతో క్రిమియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో రోడ్డు రైలు మార్గాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో సరుకు రవాణాతో పాటు ఇంధన రవాణా లాంటివి ప్రజలకు అందకుండా పోయాయి. వీటితో పాటు రష్యాను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి మరిన్ని దారుణాలకు కూడా పాల్పడుతోంది. గతంలో చెర్నోబిల్ అణువిద్యుత్ కర్మాగారాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ఘటనలో అణువిద్యుత్ ప్లాంట్లపై ఉక్రెయిన్ క్షిపణులను ప్రయోగించిందనే వార్తలు వెలువడ్డాయి. ఒకవేళ క్షిపణి దాడుల్లో కానీ చెర్నోబిల్ ప్లాంటు ధ్వంసం అయి ఉంటే భారీ దుర్ఘటన సంభవించేది. ఈ విధంగా జెలెన్ స్కీ సొంత ఉక్రెయిన్ ప్రజలకే మోసం చేసేలా ప్రవర్తించాడు.

దీంతో పాటు తాజాగా జెలెన్ స్కీ ఖేర్సన్ లోని ఖకోవ్కా హైడ్రో పవర్ ప్రాజెక్టుపై క్షిపణి దాడి చేయబోతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జెలెన్ స్కీ ఈ ఆనకట్టపై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని రష్యాకు ఇంటలిజెన్స్ సమాచారం అందింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆ హైడ్రో ప్రాజెక్టు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల మేర ప్రజలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకవేళ జెలెన్ స్కీ కనుక ఈ చర్యకు పూనుకుంటే ఆ డ్యామ్ కు చుట్టుపక్కల భారీ వరదలు సంభవించి ప్రాణ ఆస్థినష్టం పెద్దయెత్తున సంభవించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటువంటి ఆనకట్టలను కూలిస్తే జెనీవా ఒప్పందంలోని నిబంధనలను కూడా కాలరాసినట్లే అవుతుంది. దీంతో పాటు సొంత ప్రజలకు దీర్ఘకాళికంగా నష్టం చేకూర్చినట్లవుతుంది.

ఇప్పటికైనా జెలెన్ స్కీ అమెరికా యూరప్ దేశాలు పన్నిన ఉచ్చు నుంచి బయట వచ్చి యుద్దం ఆపివేసేందుకు కావాల్సిన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇంతకంటే ఎక్కువగా ఉక్రెయిన్ ను నాశనం కాకుండా ఆపాల్సి ఉంటుంది. మరి కమెడియన్ అధ్యక్షుడు ఇప్పటికైనా ఆ పని చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

13 + eleven =