ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని కితౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో తన కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కార్యక్రమం ముగించుకుని ఒవైసీ తన కారులో ఢిల్లీకి తిరిగి వస్తుండగా గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో తన వాహనం టైర్లు కూడా పంక్చర్ అయ్యాయని అసదుద్దీన్ చెప్పారు. ఒవైసీ మీరట్ జిల్లా కితౌర్ లో ప్రచారం నిర్వహించారు. తిరిగి వెళ్తుండగా తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు జరగలేదని తెలిపారు.
అసదుద్దీన్ ఒవైసీ భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జెడ్ కేటగిరీలో 22 మంది రక్షణ సిబ్బంది ఉంటారు. ఇందులో నాలుగు నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు. అసుద్దీన్ ఒవైసీ తాను భద్రతను ఎప్పుడూ కోరలేదని, కోరబోనని స్పష్టం చేశారు. ఎందుకంటే తన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.
ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. “హలో ఒవైసీ గారూ… 15 నిమిషాలు పోలీసులను పక్కనబెడితే హిందువులకు గుణపాఠం నేర్పుతానని మీ తమ్ముడు అన్నాడు. మీరు కూడా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల తర్వాత యూపీ పోలీసులకు గుణపాఠం నేర్పాలని భావించారు. కానీ మీరే జెడ్ ప్లస్ భద్రత పొందాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా మీకు రక్షణ కల్పిస్తారులే. ఇప్పుడు మీకు నిజంగా సురక్షితంగా ఉన్నామన్న భావన కలుగుతుందని ఆశిస్తున్నా” అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద అసదుద్దీన్ పై దాడి జరిగిన వీడియో బయటకు వచ్చింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఒవైసీ కారుపై కాల్పులకు పాల్పడిన వారిలో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. దీనికోసం అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్ శాంతి భద్రతల విభాగం అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కాల్పులు జరపడానికి నిందితులు 9 ఎంఎం పిస్టల్‌ను వినియోగించారని.. నిందితుడి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.