2024 ఎన్నికలలో వైసీపీ గెలవదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆ పార్టీకి ఓటమి ఖాయమని.. వైసీపీకి ఓటు అడిగే హక్కే లేదని ఆయన అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన పవన్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించి చెప్పానని అన్నారు. “శ్రీలంకలా ఏపీ అవ్వొద్దనే ఆ మాట అన్నా. నా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వ్యూహం నాకు వదిలేయండి చాలు. నేను ఎవరి పల్లకీ మోయడానికి రాలేదు. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే వచ్చా.” అని పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ కల్యాణ్ ను నమ్ముకుని మరోసారి జనసేన కార్యకర్తలు మోసపోవద్దని వైసీపీ అంటున్నారని.. తమ మీద అంత ప్రేమ వైసీపీ నేతలకు అవసరం లేదని సూచించారు. తాము వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని చేసిన ఒక్క ప్రకటనతో అధికార వైసీపీ నేతలు భయపడిపోతున్నారని పవన్ అన్నారు. రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు చనిపోతుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేని సమస్యల గురించి ప్రస్తావించడం లేదని.. ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ అన్నారు. తాము ఎవరి పల్లకి మోయబోమంటూ.. ఎవరినో గద్దెనెక్కించడానికి సిద్ధంగా లేమని పవన్ అన్నారు. రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీకి అసలు ఓటు అడిగే హక్కే లేదన్నారు. 2018లో కరెంట్ ఛార్జీల పెంపును జగన్ వ్యతిరేకించారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఏ విపత్తు వచ్చినా మొదట నష్టపోతుంది రైతులేనని.. ఆత్మహత్య చేసుకున్న అనేకమంది రైతుల రుణం రూ.5 లక్షల్లోపే ఉందని అన్నారు. రైతు కుటుంబాలకు మంచి మనసుతో సాయం చేస్తున్నామని.. కౌలురైతులకు సాయం చేయడాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తామని అన్నారు. వైసీపీ నేతల ధ్యాసంతా డబ్బు తీసుకోవడంపైనే ఉంది కానీ.. ఇవ్వడంలో లేదని పవన్ విమర్శించారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలోనే రూ.5 కోట్ల చెక్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబులకు అందజేశారు. ఇదే సమావేశంలో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నాగబాబు సైతం కౌలు రైతుల కుటుంబాల కోసం రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లుగా ఉగాది రోజున పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకు మంగళవారం నాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పవన్ కౌలు రైతుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు పవన్. ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని తెలిపారు.