వైసీపీ ప్లీనరీ సమయంలో.. ర‌ఘురామ‌కు షాకిచ్చిన తెలంగాణ హై కోర్టు

0
759

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ త‌గిలింది. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌తో పాటు త‌న కుమారుడిపైనా న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రఘురామ‌రాజు దాఖ‌లు చేసుకున్న క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైద‌రాబాద్‌లోని త‌న ఇంటి వ‌ద్ద రెక్కీ నిర్వ‌హిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ర‌ఘురామ‌రాజు సిబ్బంది ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి దిగార‌నే ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ర‌ఘురామ‌రాజు, ఆయ‌న కుమారుడు భ‌ర‌త్‌, ర‌ఘురామ‌రాజుకు భ‌ద్ర‌త కోసం ప‌నిచేస్తున్న ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా గ‌చ్చిబౌలి పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ వ్య‌వ‌హారంలో కేసులు న‌మోదైన ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు త‌న స‌హ‌చ‌ర పార్ల‌మెంటు స‌భ్యుల‌కు లేఖ రాశారు. 4 పేజీల‌ లేఖ‌లో వైసీపీ నేత‌ల‌పైనా, ప్ర‌త్యేకించి సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న పలు ఆరోప‌ణ‌లు చేశారు. అందుకు సంబంధించిన లెటర్ ను రఘురామ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార దుర్వినియోగం చేసి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో తెలిపారు.