గురువారం లోక్ సభలో వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, నిధుల దారి మళ్లింపుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతుండగా, మరో ఎంపీ మార్గాని భరత్ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇద్దరు సభ్యులను శాంతింపజేసేందుకు స్పీకర్ స్థానంలోని పానెల్ స్పీకర్ రాజేంద్ర అగ్రవాల్ శ్రమించాల్సి వచ్చింది.
తొలుత ఏపీ ఆర్థిక పరిస్థితిపై రఘురామరాజు మాట్లాడుతూ మద్యం ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఏపీ ప్రభుత్వం మళ్లిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన సొమ్ములను కార్పొరేషన్‌కు మళ్లించడం చట్టవిరుద్ధమని.. మద్యం ఆదాయాన్ని మళ్లిస్తున్న అంశంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని ఇటీవల కేంద్రం చెప్పిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రఘురామ రాజు ప్రసంగాన్ని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అడ్డుకున్నారు. ఆధారాలు లేకుండా అనవసర ఆరోపణలు చేయొద్దని ఆయన రఘురామను వారించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్‌తో కలిసి వైసీపీ ఎంపీలు రఘురామకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.