హిందూపురంలో వైసీపీ నేత దారుణ హత్య

0
906

హిందూపురం వైసీపీ నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబా మూసేసి కారులో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. మొత్తం 18 చోట్ల విచక్షణ రహితంగా నరికి పరారయ్యారు. ఏకంగా వేళ్లు తెగి పడిపోయాయి. మెడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడిన ఆయనను స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు.

మాస్కులు ధరించిన ఐదుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చారని, ఇద్దరు దుండగులు బైక్‌పైనే ఉండగా మిగతా ముగ్గురు రామకృష్ణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తన కుమారుడి హత్య వెనక ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్, హిందూపురం రూరల్ సీఐ ఉన్నారని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపించారు. రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వర్గీయులకు ఇటీవల వివాదం జరిగిందని, ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చాయని చెబుతున్నారు. రామకృష్ణారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.