గుంటూరులోని జిన్నా టవర్ కు ఇటీవల త్రివర్ణ పతాక రంగులు వేయగా.. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, గుంటూరులో జిన్నా టవర్ కు చాలా ప్రత్యేకస్థానం ఉందని, జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడున్న వారిలో చాలామంది పుట్టి ఉండరని అన్నారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు అందరం స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని సుచరిత అన్నారు. భారతీయులందరూ ఒక్కటే అన్న భావనతో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో కలిసి మెలసి ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ మాట్లాడుతూ దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. జిన్నా టవర్ అంశం ముస్లింలు, హిందువుల కోసం కాదన్నారు. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టవర్ పేరు మార్చకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కానీ గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయన్నారు. జిన్నా టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. బీజేపీ డిమాండ్ మేరకు టవర్‌కు రంగులు మార్చారని, జాతీయ జెండా దిమ్మె పెట్టడం శుభపరిణామమన్నారు. జాతీయ జెండా రంగులు మన దేశానికి గర్వ కారణమన్నారు. ముడు రంగులు ఉన్న టవర్‌కు జిన్నా పేరు పెట్టడం దేశ ద్రోహమన్నారు. దేశ ప్రజలను తీవ్రంగా అవమానించినట్లేనన్నారు.
జనవరి 26న, దేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించిన వ్యక్తులను గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. వారు కొందరిని అరెస్టు చేసి భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి ఎవరూ టవర్‌పైకి ఎక్కకుండా భద్రతను పెంచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భారతదేశంలో జిన్నా పేరుతో ఒక టవర్, సర్కిల్ ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా పేరు మార్చాల్సిందే అనే డిమాండ్ వస్తూనే ఉంది.