వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వివేకా మృతికి నలుగురు వ్యక్తులు కారణమని ఛార్జ్ షీటులో తెలిపింది సీబీఐ. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, డ్రైవర్ దస్తగిరిలు హత్య చేసినట్టు అభియోగాలు మోపింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీరిని అరెస్ట్ చేశామని.. నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని అన్నారు. వీరిలో ఇద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైల్లో ఉన్నారని సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సీబీఐ ఛార్జిషీట్ కాపీని తనకు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు…
నాలుగు నెలల నుంచి సాగుతున్న విచారణలో సేకరించిన పత్రాలతో కూడిన నాలుగైదు బండిల్స్‌ను ఛార్జ్ షీట్ లోని అంశాలకు ఆధారాలుగా సమర్పించింది సీబీఐ. మంగళవారమే చార్జిషీట్ దాఖలు చేసేందుకు పులివెందుల కోర్టుకు వచ్చారు సీబీఐ అధికారులు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండటంతో తిరిగి వెళ్లిపోయారు. బుధవారం వచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చోటు చేసుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిట్ విచారణకు ఆదేశించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ సిట్ విచారణ నిర్వహించింది. ఈ విషయమై అసలు దోషులను పట్టుకోవాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సహా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు ఏపీ హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.