వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి అనుమానాస్పద మృతి..!

0
967

వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి (49) అనుమానాస్పద రీతిలో మృతిచెందాడం కలకలం రేపింది. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి గంగాధర్ రెడ్డి మరణించారు. నిద్రపోయిన అనంతరం గంగాధర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్‌‌ను కూడా రప్పించి పలు వివరాలు సేకరించారు. గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గంగాధర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యుల వాదన. నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే మూడుసార్లు గంగాధర్‌రెడ్డిని విచారించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందుల కాగా.. ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా అనంతపురం జిల్లాలోని యాడికిలో ఉంటున్నారు. సీబీఐ అధికారులు బెదిరించి ఏకపక్షంగా సాక్షం చెప్పంటున్నారని గతం లో ఎస్పీకి గంగాధర రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రెండుసార్లు ఎస్పీని కలిసారు.