వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

0
784

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నాడు ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఈ ఏడాది ఆగస్టు 12న వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రంలో విచారణ నిర్వహించాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు.

కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రింకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది. విచారణను వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలనే కారణాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఏపీ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది. హైదరాబాదుకు కేసును బదిలీ చేయాలా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించగా… ఏపీకి దగ్గరగా హైదరాబాద్ ఉందని… అందువల్ల విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక సహా ఏ రాష్ట్రమైనా అభ్యంతరం లేదని తెలిపారు. కేసు విచారణను ఎక్కడకు బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం నాడు తమ తీర్పులో వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది.