More

    వైఎస్ షర్మిలను ‘మరదలు బయల్దేరింది’ అన్న తెలంగాణ మంత్రి.. ఘాటు రిప్లై

    వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలనూ ఆమె కొనసాగిస్తున్నారు. ఆమెపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలనుద్దేశించి మాట్లాడుతూ మంగళవారం మరదలు బయల్దేరిందంటూ కామెంట్ చేశారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరింది’’ అంటూ వ్యాఖ్యానించారు.

    ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. మంత్రి నిరంజన్‌ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని కౌంటర్ వేశారు. కేసీఆర్‌ కుమార్తె కవితను కూడా ఇలాగే హేళన చేస్తారా అని ప్రశ్నించారు. ఈ కుక్కకు కేసీఆర్‌ బిడ్డ కవిత ఏమవుతుందో ప్రజలు అడగాలని కోరారు. ఆయనకు భార్య బిడ్డలు, తల్లి, చెల్లి లేరా..? అంటూ నిలదీశారు. అయినా చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని అన్నారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని.. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని మండిపడ్డారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని షర్మిల అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మహిళలపై ఈ రకమైన వ్యాఖ్యలు చేసే వారికి బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ని అరెస్ట్ చేయండని వైఎస్ షర్మిల పోలీసులకు సవాల్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని ప్రశ్నించడానికి వెళ్లిన నా అనుచరులను అరెస్టు చేశారని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. మీకు ధైర్యం ఉంటే నా పైన అనుచిత వ్యాఖ్యలను చేసిన మంత్రిని పోలీసు స్టేషన్ లో కూర్చోపెట్టండి అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

    ఈ నెల 20న చేవెళ్ల నుంచి వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభించిన పాదయాత్ర గురువారం ఎలిమినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నానికి చేరుకుంది. 9 రోజుల్లో వంద కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లి విజయమ్మతో కలసి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

    Related Stories