కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం గురించి గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై సెప్టెంబరు 30 లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో షర్మిల అధ్యక్షతన పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మొత్తం 33 జిల్లాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు.
ఒక వేళ విలీనం చేయకపోతే తెలంగాణ ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం కాకుంటే.. తెలంగాణ ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. అక్టోబరు రెండోవారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.