బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారని తెలుస్తోంది. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని, ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని, కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల అన్నారు. షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.
శుక్రవారం నాడు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ ఘటనలో అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. తనకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని, ఎందుకు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.