మీడియాతో మాట్లాడుతూనే కుప్పకూలిన వైఎస్ షర్మిల..!

0
519

ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతున్న ఆమె ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. వైరా నియోజక వర్గం కొణిజర్ల మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలంచారు. కొణిజర్ల మండలంలోని తనికెళ్ళ గ్రామం బోనకల్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో పర్యటించి రైతులను పరామర్శించారు. పంట నష్టం వివరాలను రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు.

ఈ పర్యటనలో షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతు ద్రోహిగా అభివర్ణించారు. పంట పెట్టుబడికి, జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, ఎకరానికి 30,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలను చెల్లిస్తామంటూ కేసీఆర్ ఇచ్చిన హామీలు గాలిమాటలయ్యాయన్నారు. 5,000 రూపాయలను రైతుబంధు కింద ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.