వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉదయం ఉద్రిక్తత నెలకొంది. మొదటగా ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వైఎస్ షర్మిల పీర్జాదిగూడలో దీక్ష చేపట్టాలని భావించగా, అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆమె అక్కడకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో హైదరాబాద్ బోడుప్పల్‌లో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల, ఆమె మద్దతుదారులు, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించారు. ఆ సమయంలో పోలీసులు, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా షర్మిలతో పాటు ఆమె మద్దతుదారులు నినాదాలు చేశారు.
పోలీసుల జులుం నశించాలంటూ షర్మిల పోలీసుల కారులోనూ నినాదాలు చేశారు. శాంతియుతంగా దీక్ష చేసేందుకు వచ్చిన తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె నిలదీశారు. విషయం తెలియడంతో మేడిపల్లి పీఎస్‌కు వైఎస్సార్ టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వందల మంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకున్న హంతకుడు కేసీఆర్ అని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే తమ దీక్షకు అనుమతి ఇవ్వలేదని ఆమె ధ్వజమెత్తారు.
మా డబ్బులు ఎవరు ఇస్తారు: కూలీలు
ఇక నిరసన కార్యక్రమాలకు అద్దెకు వచ్చే వాళ్ళు ఉంటారు. షర్మిల దీక్ష కోసం కూడా వాళ్ళను పిలుచుకుని వచ్చారు. అయితే దీక్ష అక్కడ జరగకపోవడంతో తమ డబ్బులు తమకు కావాలని డిమాండ్ చేశారు. పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షలో పాల్గొనడానికి వైఎస్సార్‌టీపీ నేతలు అడ్డాకూలీలను అప్పటికే అక్కడికి తీసుకొచ్చారు. అయితే, దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసనకు దిగారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని తెలిపారు. తమ కూలీ తమకు ఇవ్వాలని కోరారు.