More

    రూల్స్ పెట్టే వాళ్లు పాటించరా.. మాస్కు లేకుండా ఏపీ సిఎం

    భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా ఉన్నాయి కరోనా కేసులు. మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు సూచనలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలందరూ మాస్కులు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని కోరారు. మాస్కులు పెట్టుకోని వారిపై ఆంధ్రప్రదేశ్ లో జరిమానా కూడా విధిస్తూ ఉన్నారు.

    నేడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాస్క్ పెట్టుకోకుండా కనిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాస్కు పెట్టుకోలేదు. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. ఇలా మాస్కు లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి.

    సిఎం జగన్ మాస్కు లేకుండా ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారు?” అంటూ ట్వీట్ చేశారు. “తొలి విడ‌త‌లో కోవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చ‌ల్లితే చ‌స్తుంది ..ఇట్ క‌మ్స్ ఇట్ గోస్..ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారు.” అంటూ విమర్శలు గుప్పించారు. “సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మ‌శానంగా మారుతుంటే చిరున‌వ్వులు చిందిస్తూ,మీరే మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెన్ని వేల‌మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మ‌నిషిన‌ని నిరూపించుకుంటారో మీ ఇష్టం.” అని అన్నారు.

    Trending Stories

    Related Stories