Telugu States

తాడేపల్లి అత్యాచార ఘటనపై స్పందించిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి అత్యాచారం ఘటనపై స్పందించారు. ఓ నర్సింగ్ విద్యార్థినిపై ప్రకాశం బ్యారేజి సమీపంలో జరిగిన అత్యాచార ఘటన మనసుకు ఎంతో బాధ కలిగించిందని.. ఇది దురదృష్టకరమని అన్నారు. ఇకపై ఇలాంటి వికృత చర్యలు జరగకుండా ఓ అన్నగా, తమ్ముడి మరింత శ్రమిస్తానని అన్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ ఘటన జరిగిందని.. దీనికి తాము చింతిస్తున్నామని అన్నారు. స్త్రీలు అర్ధరాత్రి వేళ కూడా ధైర్యంగా తిరిగే పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని బలంగా విశ్వసిస్తానని వైఎస్ జగన్ అన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం కూడా చేశామని, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించామని, 900 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక మీదట ప్రకాశం బ్యారేజి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అత్యాచార బాధితురాలికి ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, సుచరిత బాధిత యువతిని పరామర్శించారు. తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే రూ. 5 లక్షలతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ. 50 వేలు అందిస్తామన్నారు. ఇద్దరు నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. యువతి కాబోయే భర్తపై దుండగులు దాడిచేసి ఆభరణాలు కూడా లాక్కెళ్లిపోయారని చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆధారాలను సేకరించినట్టు మంత్రి వనిత వెల్లడించారు.

హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని.. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమన్నారు. తాడేపల్లి ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + ten =

Back to top button