More

    సినిమా టికెట్ రేట్లు తగ్గించడంపై వచ్చిన విమర్శలపై స్పందించిన ఏపీ సీఎం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. ఏపీలో వైఎస్సార్ పింఛను కానుక పథకం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగన్ ప్రారంభించాక మాట్లాడుతూ.. సినిమా టికెట్ల విష‌యంలో వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై కూడా స్పందించారు. పేదల కోసం సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని జ‌గ‌న్ అన్నారు. ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్న‌ వాళ్లంతా పేదల వ్యతిరేకులని ఆయ‌న అన్నారు. పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడకూడదనే జ్ఞానాన్ని ఇలాంటి వాళ్లకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న‌ట్లు వైఎస్‌ జగన్ వ్యాఖ్యానించారు. మంచి చేస్తుంటే కొంద‌రు విమ‌ర్శిస్తున్నారని, ఇటువంటి వారూ ఉంటారని ఆయ‌న అన్నారు.

    గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని ప్రభుత్వం రూ.2,500కు పెంచింది. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పెన్షన్‌ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్‌ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్‌ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు . కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామని.. అభివృద్ధి గురించి ఆలోచించని కొన్ని పార్టీలు మమ్మల్ని విమర్శిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అన్నారు. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఓటీఎస్‌ పథకంపై కూడా దుష్ఫ్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులేనన్నారు.

    Trending Stories

    Related Stories