సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఎకరాకు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని.. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుని, సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇస్తుందని చెప్పారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజును పెంచుతుందని తెలిపారు. ఒక్కో లొకేషన్ లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని.. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు.
నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను జగన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో రూ.1790 కోట్లతో నెలకొల్పిన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని.. ఒక పరిశ్రమ రావడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని… స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. రామ్ కో సిమెంట్ పరిశ్రమతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు.