పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
807

ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో గురువారం జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. దత్త పుత్రుడితో ఏం మాట్లాడిస్తున్నారో మనమంతా చూస్తున్నాం. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్లు టీవీల్లో ఇలాంటి సందేశాలతో ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్లు అలా మాట్లాడడం మొదలుపెడితే.. మన ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు.

వెన్నుపోటుదారులంతా ఎవరికీ మంచి చేయలేదు. పైగా ఎన్నికల తర్వాత వాళ్లు వాగ్దానాలు మరిచిపోతారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చాం. పైగా మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. మూడు రాజధానుల వల్ల మంచి జరుగుతోందని చెప్తున్నామన్నారు. వెన్నుపోటుదారులు కూడా నీతులు మాట్లాడుతుంటే వినలేకపోతున్నామని జగన్ అన్నారు. మ్యానిఫేస్టోను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగిస్తారన్నారు. దుష్టచతుష్టయంలా ఏర్పడి కలసి కూటమిలా ఏర్పడతారని, ఈ జగన్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట అని అన్నారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆశ్చర్యమనిపిస్తుందని జగన్ అన్నారు. తనకు ఎవరూ తోడు లేరని, దేవుడి దయతో పాటు ప్రజల తోడు ఉందని జగన్ అన్నారు. తనకు ఏమాత్రం భయంలేదని చెప్పారు. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను నమ్ముకుంటే తాను లక్షలాది కుటుంబాలను నమ్ముకున్నానని అన్నారు. మంచికి, మోసానికి జరుగుతున్న యుద్ధమని అన్నారు. ఈ మోసాలను నమ్మొద్దు.. ఈ యెల్లో మీడియాను పట్టించుకోవద్దు.. మంచిని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ప్రజలను కోరారు.