ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. తనను టీడీపీ నేతలు తిట్టడంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో అందిస్తోన్న సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం ఎలా తయారయిందో ఏపీ ప్రజలే గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోందని ఆయన అన్నారు. కొందరు పరుష పదజాలం వాడుతుండడమే కాకుండా.. దారుణమైన భాష మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నడూ ఇలా మాట్లాడలేదని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారని.. ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపణలు గుప్పించారు. వారి ప్రతిమాటలోనూ వంచన కనిపిస్తోందని, మత విద్వేషాలను సైతం రెచ్చగొట్టేందుకు టీడీపీ వెనకాడదని అన్నారు. కావాలనే తిట్టించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా తనపై ప్రజాభిమానాన్ని జీర్ణించుకోలేక ఎలా తయారయ్యారో అందరూ చూస్తున్నారన్నారు. వీళ్లే బూతులు తిడతారన్నారు. ఎవరూ వినలేని, మాట్లాడలేని రీతిలో బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బూతులు వినలేక, టీవీల్లో చూడలేక మనల్ని అభిమానించే వాళ్లలో బీపీ పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా రియాక్షన్ కనిపిస్తోందన్నారు. కావాలని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆరాటం మన ఖర్మ కొద్ది రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. అబద్ధాలు ఆడతారని, అసత్యాలు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడతారన్నారు. వ్యవస్థల్ని పూర్తిగా మేనేజ్ చేసే పరిస్థితులు మన కళ్ల ముందే ఉన్నాయన్నారు.
నేడు ‘జగనన్న తోడు’ కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జమ చేశారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది.