ఉద్యోగుల సమ్మెపై మాట్లాడిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎర్ర జెండా వెనుక పచ్చ జెండా

0
860

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు కోసమే రాష్ట్రంలోని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లోమీడియాకు పండగ అని.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదంటే వాళ్లు ఏడుపు మొహం పెట్టుకున్నారని అన్నారు. సమ్మె విరమించారనే విషయం తెలియగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారని.. చంద్రబాబు నాయుడుకు, ఎల్లోమీడియాకు మాత్రమే సమ్మె కావాలని అన్నారు. ఎర్రజెండాలు, పచ్చజెండాలు కలిపి ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చంద్రబాబు బినామీ భూముల కోసం కామ్రేడ్లు జెండాలు పట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలో పేదల ఇళ్లను అడ్డుకున్న వ్యక్తి కామ్రేడ్లకు ఆత్మీయుడుగా మారాడని, ఎర్ర జెండా వెనక.. పచ్చ జెండా ఉందని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే ఆందోళనలు కావాలన్నారు. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదనే బాధ, కడుపు మంట ఉన్నవారికే సమ్మెలు కావాలి. చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మెలు కావాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే వీళ్లకు పండగ. ఆశావర్కర్లు రోడ్ల మీదకు వచ్చారని కథనాలు ప్రచురించారు. మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రిని తిడితే బాగా కవరేజ్ ఇస్తామని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని ప్రధాన వార్తలుగా ప్రచురిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

జగనన్న చేదోడు పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద నిధులు విడుదల చేశారు. సీఎం జగన్ 2.85 లక్షల మంది దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.285.35 కోట్లు బదిలీ చేశారు. నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, రజకులు తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. సాయం పేరుతో గత ప్రభుత్వం నాణ్యతలేని పరికరాలు ఇచ్చిందని, సాయం అందించడంలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. బీసీలంటే పనిముట్లు, వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెన్నెముక అని నమ్మి నిండుమనసుతో వారికి మంచి చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆశావర్కర్లకు జీతం రూ. పదివేలకు పెంచామని తెలిపారు.