పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్, వైఎస్సార్ అంటేనే పోలవరమని అన్నారు. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదన్నారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నోటి నుంచి ఒక్కసారి కూడా పోలవరం పేరు రాలేదని, టీడీపీ ప్రభుత్వ హాయంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు. పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అన్న జగన్, ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత బాబుకు లేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశానని, అవన్నీ అసత్య కథనాలని అన్నారు. పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ అభూత కల్పనలతో ఎల్లో మీడియా వార్తలు రాసిందన్నారు. చంద్రబాబు హయాంలో స్పిల్ వే పనుల్ని అసంపూర్ణంగా పునాదుల స్థాయిలోనే వదిలేసి.. కాఫర్ డ్యాం పనుల్ని మొదలుపెట్టారన్నారు. కాఫర్ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని.. అప్రోచ్ చానల్ పనులు కూడా జరగలేదని సీఎం జగన్ విమర్శించారు. అసలు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం పనుల్ని ఎలా పూర్తి చేస్తారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్‌ఆర్ చెప్పారన్నారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉందని, స్పిల్‌వే పూర్తి చేసి 48 గేట్లు పూర్తి చేశామని జగన్ అన్నారు.