ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన కు వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. సీఎం జగన్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ తదితరులను కలవనున్నారు. సీఎం జగన్ రేపు మధ్యాహ్నం ఏపీకి చేరుకుంటారు. ఢిల్లీకి సీఎం వెంట వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి కూడా ఉన్నారు.
సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను కలవనున్నారు.
రాత్రి 9 గంటలకు అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రాష్ట్రానికి చెందిన అంశాలను అమిత్ షాతో సమగ్రంగా చర్చించనున్నారు. శుక్రవారం ఉదయం రైల్వే మంత్రి పియూష్ గోయల్ తో సమావేశమై, రాష్ట్రానికి తిరిగి రానున్నారు.