Telugu States

మోదీకి లేఖ రాసిన వైఎస్ జగన్.. జల దోపిడీలో జగన్ హస్తమన్న రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ దాకా వెళ్ళింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఐదు పేజీల లేఖను పంపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని లేఖలో జగన్ ఆరోపించారు. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా జలాలను ఉపయోగిస్తోందని, దాన్ని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రధానిని జగన్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంలో కలగజేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ తో రక్షణ కల్పించాలని కోరారు. లేఖతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కోకు రాసిన లేఖ, విద్యుదుత్పత్తికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని జత చేశారు వైఎస్ జగన్. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుదుత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వివాదం నెలకొంది. ప్రాజెక్టులు సగమైనా నిండకుండానే సాగర్ లో విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే కరెంట్ ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకుండా జలవిద్యుత్ ను తయారు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేని ఆరోపించారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించారు.

ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు పునర్విభజన చట్టానికి వ్యతిరేకమంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ సీఎస్‌ లేఖ రాయగా.. పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి లేఖ రాశారు. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని, వెంటనే వాటిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 నిర్ణయాన్ని కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదని, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోయినా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని ఆ లేఖలో ఆరోపించారు.

కొద్దిరోజుల కిందట టీఆర్ఎస్ నేతలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జల దోపిడీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆద్యుడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వెర్షన్ ను వినిపించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు. నదీ జలాల విషయంలో లేనిపోని వివాదాలను సృష్టించి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణమని అన్నారు. నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ఆగ్రహించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని… కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయని రేవంత్ అన్నారు. కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిపించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

9 − 2 =

Back to top button