నేడు శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలలో పాల్గొననున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

0
737

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాదుకు వెళ్లనున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం 3.50 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాదుకు వెళ్తారు. సాయంత్రం 4.30 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్లి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆయన అక్కడే ఉంటారు. రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరి, రాత్రి 9.05 గంటలకు చేరుకుంటారు.

ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 114 యాగశాలల్లో పూర్తి శాస్త్రోక్తంగా జరుగుతున్న యజ్ఞాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరిగింది. 108 దివ్యదేశాల్లోని 33 ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. యజ్ఞ, యాగాదులు, అష్టాక్షరీ మంత్ర పఠనం మధ్య ఉత్సవ విగ్రహాలు అత్యంత శక్తిమంతంగా మారతాయి. విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33 ఉత్సవ విగ్రహాలతో పెరుమాళ్లస్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓం నమోనారాయణాయ అష్టాక్షరీ మంత్ర పఠనంతో సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు వేడుకలు మొదలయ్యాయి. ప్రధాన యాగశాలలో అష్టాక్షరీ మంత్ర పఠనం జరిగింది. అనంతరం శ్రీ పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన పూర్తయింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞహోమం జరిగింది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం నిర్వహించనున్నారు. రాత్రి 9గంటలకు పూర్ణాహుతి ఉంటుంది.