ముగిసిన వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు వైఎస్ జగన్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు.
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఈ రోజు సమావేశమయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆయన చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యామ్నాయాలను వివరించారు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని సీఎం జగన్ కోరారు. వయబిలిటి గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై భారం పడకుండా చూడాలని తాను ధర్మేంద్ర ప్రధాన్‌కు వైఎస్ జగన్ వివరించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారని, వచ్చే వారం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు.
గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలుసుకున్నారు వైఎస్ జగన్. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ గతేడాది చట్టాన్ని తీసుకొచ్చామని, కాబట్టి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రీ నోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా గ్రాంట్లు వస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్లను ఇప్పించాలని.. విశాఖలోని అప్పర్ సీలేరు రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు అయ్యే రూ. 10,445 కోట్ల వ్యయంలో 30 శాతం నిధులు సమకూర్చాలని కోరారు. 14, 15వ ఆర్థిక సంఘం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని, రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. నిధుల చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలని షెకావత్‌ను జగన్ కోరారు. సీఎం జగన్ తో భేటీపై కేంద్రమంత్రి షెకావత్ ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని వెల్లడించారు. జల్ శక్తి సంబంధింత ప్రాజెక్టులపై చర్చించామని తెలిపారు. ఏపీలో 100 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చే అంశం చర్చకు వచ్చిందని అన్నారు.