ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇంతకుముందే వాదనలు పూర్తవ్వగా.. విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు వాదనలు పూర్తయ్యాయి. జగన్ పై పిటిషన్ విషయంలో ఈ రోజు తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించిన కోర్టు… తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని నేడు పేర్కొంది. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది.
తుది తీర్పును సీబీఐ కోర్టు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేయడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మరోవైపు కోర్టు తీర్పు వెలువడక ముందే సాక్షి మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం వచ్చిందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ సమాచారం సాక్షి మీడియాకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కోర్టు స్పందన రాకముందే తన పిటిషన్లను కోర్టు తిరస్కరించిందనే వార్తలు సాక్షిలో ఎలా వస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కు చిత్తశుద్ది ఉంటే ఈ సమాచారాన్ని ఇచ్చిన సాక్షి జర్నలిస్టుతో పాటు సాక్షి మీడియాపై విచారణ జరిపించాలని రఘురాజు డిమాండ్ చేశారు.