యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని వెంటబడి మరీ కొట్టిన బీజేపీ నేత కరాటే కళ్యాణి

0
920

సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి.. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని వెంటబడి మరీ కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేసింది. నడిరోడ్డుపై అతడిని పట్టుకుని చితకబాదింది. హైదరాబాద్ మధురానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. అయితే శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కళ్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని తెలిపింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. మధురానగర్ రోడ్డులో శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. ఆ సమయంలో అక్కడున్న వారు కూడా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. దీంతో అతడు కూడా కరాటే కళ్యాణిపై దాడి చేయడంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. ప్రతిగా శ్రీకాంత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కరాటే కళ్యాణితో పాటు.. తనని కొట్టిన వ్యక్తిపై దాడి చేశాడు ప్రాంక్ లు చేసే శ్రీకాంత్ రెడ్డి. ఈ గొడవలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత మళ్లీ లేచి శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి గుడ్డలు చిరిగేదాకా కొట్టింది కరాటే కళ్యాణి. బూతులు తిడుతూ అతడిపై దాడికి పాల్పడింది. ఫ్రాంక్ వీడియోలు తీయడం ఇష్టం లేకపోతే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అంతే తప్ప నన్ను కొట్టే హక్కు నీకు ఎక్కడిది అంటూ కరాటే కళ్యాణిని ప్రశ్నించాడు శ్రీకాంత్ రెడ్డి. తనతో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగిందని, అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేసిందంటూ ఆరోపణలు చేశాడు శ్రీకాంత్ రెడ్డి.