మణిపూర్‌లోని లిలాంగ్ పోలీసులు ఆవును వధించినందుకు అబ్దుల్ రషీద్, నజ్బుల్ హుస్సేన్, మహ్మద్ ఆరిఫ్ ఖాన్ అనే ముగ్గురు ముస్లిం యువకులను అరెస్టు చేశారు. బీజేపీ జెండాపై యువకుల బృందం ఆవును వధించిన వీడియోలు సోషల్ మీడియా సైట్లలో కనిపించాయి. దీంతో 1960, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. సదరు యువకులు మద్దతు ఇస్తున్న అభ్యర్థికి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో ఆ యువకులు బీజేపీ జెండాపై ఆవును వధించారు.
గోవును దారుణంగా వధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 29 సెకన్ల నిడివి గల వీడియోలో.. ఓ యువకుల బృందం, దాదాపు 10 మంది కలిసి బీజేపీ జెండాపై గోవు గొంతును కోయడం కనిపించింది. ఈ గుంపు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, బీజేపీ మణిపూర్ యూనిట్ ప్రెసిడెంట్ అధికారిమయుమ్ సర్దా దేవిని కూడా తిట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వివిధ కులాలు, వర్గాల మధ్య గొడవకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. ఇంఫాల్ వెస్ట్ జిల్లా పరిధిలోని లిలాంగ్ పోలీసు అధికారులు ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, వివిధ మత సమూహాల మధ్య మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన లిలాంగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెం 10(01)2022 లిలాంగ్ పీఎస్ కింద, జంతు హింస నిరోధక చట్టం, 1960లోని సెక్షన్లు 153A, 429, 504 IPC మరియు సెక్షన్ 11(1) కింద సుమో-మోటో కేసు నమోదు చేశారు. ముగ్గురు వ్యక్తులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మణిపూర్‌లో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఆశావహులకు బీజేపీ టికెట్లు లభించకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.