More

    ల్యాప్ టాప్ పేలింది.. 80 శాతం కాలిన గాయాలతో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కడప యువతి

    కడప: బి కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో సోమవారం తన గదిలో ల్యాప్‌టాప్ పేలడంతో ఓ టెకీ తీవ్రంగా గాయపడింది. ల్యాప్ టాప్ పేలుడు ధాటికి మంటలు చెలరేగడంతో 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 80 శాతం కాలిన గాయాలతో కొన ప్రాణాలతో పోరాడుతోంది. బెంగళూరుకు చెందిన మ్యాజిక్ సొల్యూషన్స్‌లో ఉద్యోగం చేస్తున్న సుమలత అనే యువతి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటి నుండి పని చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ తమ కుమార్తె తన బెడ్‌రూమ్‌లో ఎప్పటిలాగే ఉదయం 8 గంటలకు షిఫ్ట్ ప్రారంభించిందని చెప్పారు.

    “ఆమె తన ఒడిలో ఉంచుకుని ల్యాప్‌టాప్‌ తో పని చేసుకుంటూ ఉండగా.. అది పేలింది. ఆమె గది నుండి పొగలు రావడం గమనించి, మేము పరుగెత్తుకెళ్లి, కాలిపోయిన మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కనుగొన్నాము, ”అని వారు చెప్పారు. ఒక్కసారిగా ల్యాప్ టాప్ పేలడంతో సుమలత స్పృహతప్పి పడిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

    ఆమె తల్లిదండ్రులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొద్దిసేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి కడపలోని రిమ్స్‌-జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం ఆమెను తిరుపతిలోని మరో ఆస్పత్రికి తరలించారు. సుమలత పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు బి కోడూరు పోలీస్‌ ఎస్‌ఐ నస్రిన్‌ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించిందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ల్యాప్ టాప్ బ్యాటరీ వేడెక్కడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.

    Trending Stories

    Related Stories