అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి భారీగా చొచ్చుకొచ్చిన ఆందోళనకారులు.. తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. 2వేల మందితో రైల్వే స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన సృష్టించారు.
నిన్న రాత్రి దాదాపు 1000 మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల చేరుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే యువకులు వాట్సాప్ గ్రూపుల్లో వారం రోజులుగా రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు ముందస్తు ప్లాన్ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. దండు మహేష్ అనే వ్యక్తికి వెన్నులో బుల్లెట్ తాకడంతో ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. రాత్రి నుంచే స్టేషన్ లో కాపుకాసిన కొందరు విద్యార్థులు ఈ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్ నడిపించినట్లు తెలుస్తోంది. 15వ తేదీన మధ్యాహ్నం 1.50 గంటలకు ఈ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే 15వ తేదీన ఉదయం 11.12 గంటలకు మరో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినట్లు గుర్తించారు. ముందస్తు ప్లాన్ చేసుకున్న యువకులు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకుని ఈ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 9.30 కల్లా బస్‌లు, టాక్సీలు, ప్రైవేట్ బండ్లు మాట్లాడుకుని మిగతా విద్యార్థులంతా హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. 16వ తేదీన రాత్రి 10 గంటలకల్లా దాదాపు 500 మంది విద్యార్థులు స్టేషన్ లోపల చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి స్టేషన్ లోపలకి చేరుకున్న దాదాపు 100 మంది స్టూడెంట్స్.. స్టేషన్ ముట్టడికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ స్కీం ప్రకటన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా అప్డేట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్ వల్ల యువతకు ప్రయోజనమని తెలిపారు. అగ్నిపథ్ ఆందోళనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
అటు సికింద్రాబాద్ ఘటనపై ఉన్నతాధికారులతో రైల్వే జీఎం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఆస్తి నష్టం, ప్రయాణికుల ప్రత్యామ్నాయం తరలింపుపై అధికారులతో చర్చించారు. కాగా ఆందోళనకారులతో 3 రైలు ధ్వంసమయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. పార్సిల్ రైల్తోపాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీలు దగ్దమయ్యాయని తెలిపారు. 40 ద్విచక్రవాహనాలు కూడా ద్వంసం అయ్యాయని వెల్లడించారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు.