More

    ట్విట్టర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత ప్రభుత్వం

    సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పారదర్శకంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఎన్నో రోజులుగా ఉన్నాయి. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై ట్విట్టర్ సరిగా స్పందించలేదు. ‘కాంగ్రెస్ టూల్ కిట్’ అంటూ బీజేపీ నేత సంబిత్ పాత్రా ట్వీట్ చేయగా, దానిపై ‘మానిప్యులేటెడ్ మీడియా’ అంటూ చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వ సూచనలను సరిగా పట్టించుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలను తాజాగా చేసింది. మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ విష‌య‌మై ఢిల్లీ పోలీసులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. ఉద్యోగుల భద్రతపై ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఓ బీజేపీ నేత ట్వీట్ల విష‌యంలో పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు ఆమోద్య‌యోగంగా లేద‌ని ఆ సంస్థ చెప్పింది. మ‌హ‌మ్మారి వేళ త‌మ సేవ‌లు కీల‌కంగా నిలిచాయ‌ని, ఎంతో మందికి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. కొత్త‌గా తెచ్చిన ఐటీ చ‌ట్టాల్లో కొన్ని మార్పులు చేయాల‌న్న సూచ‌న చేసింది. భావ స్వేచ్ఛ‌కు విఘాతం ఏర్ప‌డే అవ‌కాశం ఉందని స్పష్టం చేసింది. భారత్ లోని తమ ఉద్యోగులు, వాక్ స్వాతంత్య్రంపై తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. భారత ప్రజలకు సేవ చేసే విషయంలో ట్విట్టర్ ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తోందని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా తాము చేస్తున్న విధంగానే… ఇండియాలో కూడా తమ సేవలను పూర్తి పారదర్శకతతో కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరి గొంతుకను తమ ద్వారా వినిపిస్తామని తెలిపింది.

    ట్విట్టర్ పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రమాదం ఉందన్న ట్విట్టర్ వ్యాఖ్యలు అవాస్తవమని తేల్చి చెప్పింది. ట్విట్టర్ సంస్థవి బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు అని ఆరోపించింది. ఇది భార‌త్‌ను అప్ర‌తిష్ట పాల్జేసే య‌త్నం అని మండి ప‌డింది. ట్విట్ట‌ర్‌తో స‌హా సోషల్ మీడియా కంపెనీల ప్ర‌తినిధులంతా భార‌త్‌లో సుర‌క్షితంగా, భ‌ద్రంగానే ఉంటార‌ని ఐటీ మంత్రిత్వ‌శాఖ భరోసాను ఇచ్చింది. ఎవరి వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కు కూడా ఎటువంటి ముప్పు లేదని తెలిపింది. భావ స్వేచ్ఛపై ప్ర‌పంచం లోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ట్విట్ట‌ర్ నీతులు చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తోందని ఐటీ మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. భార‌త లీగ‌ల్ వ్య‌వ‌స్థ‌ను త‌క్కువ చేసేందుకు ట్విట్టర్ య‌త్నిస్తోందని.. నిబంధనల గురించి తమకు పాఠాలు నేర్పేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోంది అంటూ విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని, భారత న్యాయవ్యవస్థను దెబ్బతీయాలని ట్విట్టర్ చూస్తోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

    Related Stories