Special Stories

ముస్లిం ఓటు బ్యాంకుపై యోగి కన్ను..!
ఒవైసీ సవాలును స్వీకరించింది అందుకేనా..?

వచ్చే యూపీ ఎన్నికల్లో గెలుపుకోసం.. యోగి ఆదిత్యనాథ్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారా..? పకడ్బందీ ప్రణాళికలతో విపక్షాలకు చెక్ పెట్టబోతున్నారా..? అఖిలేష్ యాదవ్ ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేలా పావులు కదుపుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యోగి ప్రణాళికల గురించి తెలుసుకునేముందు.. యూపీలో ఇటీవల జరిగిన తాజా పరిణామాలపై ఓ లుక్కేద్దాం.

జిల్లా పంచాయితీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన యూపీ బీజేపీ మంచి జోష్ మీదుంది. ఇదే సమయంలో షాక్ తిన్న విపక్ష పార్టీలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. సవాలు చేస్తున్నాయి. అయితే, వారి సవాళ్లను తిప్పికొడుతూ ప్రతి సవాళ్లు విసురుతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. యోగి ఆదిత్యనాథ్ ఒకరికొకరు సవాళ్లు విసురకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమంటూ ఒవైసీ కామెంట్ చేస్తే.. మీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యోగి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల అసదుద్దీన్ మాట్లాడుతూ.. అల్లా దయతో యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఒవైసీ అన్నారు. నిబద్ధతతో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమేనని.. యూపీలో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి రాకూదన్నదే టార్గెట్ అని చెప్పారు.

ఇక, ఒవైసీ సవాల్ పై స్పందించిన యోగి ఆదిత్యనాథ్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చార. ఒవైసీ సవాల్‎ను స్వీకరిస్తున్నామని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలోని మొత్తం 403 ఎమ్మెల్యే సీట్లలో 300 పైగా బీజేపీ గెలిచి చూసిస్తుందంటూ రివర్స్ అటాక్ చేశారు. ఒవైసీ పెద్ద జాతీయ నాయకుడని.. ఆయన దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తుంటారని.. ప్రజల్లో ఆయనకంటూ ఒక క్రెడిబులిటీ ఉందన్నారు యోగి ఆదిత్యనాథ్. ఒకవేళ ఆయన బీజేపీకి సవాల్ విసిరి ఉంటే.. దానిని స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమేనని ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం 300 పైగా సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకుందని.. తాము కచ్చితంగా గెలుస్తామని కూడా చెప్పారు.

ఇక్కడ మనం ఓ విషయాన్ని గమనించాలి. ఇటీవలికాలంలో ప్రధాన రాజకీయ విరోధులైన అఖిలేష్ యాదవ్, మాయావతి సహా ఇతర రాజకీయ విపక్ష నేతలపై యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత దాడులు చేయడం లేదు. అంతేకాదు, ఇటీవల ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మీ అతిపెద్ద విరోధి ఎవరిని అడినప్పుడు.. తాను ఎవరినీ విరోధిగా పరిగణించనని.. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ అవసరమేనని జవాబిచ్చారు. అయితే, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి ప్రధాన ప్రతిపక్ష నేతల్ని విస్మరించినప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్ అసదుద్దీన్ ఒవైసీపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అతన్ని జాతీయ నాయకుడిగా పేర్కోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, దీనివెనుక పెద్ద కారణమే వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2022 యూపీ ఎన్నికల్లో ఎంఐఎం తనకు ట్రంప్ కార్డు కాబోతుందని యోగికి తెలుసని.. అందుకే, అతని సవాలును స్వీకరించి, ప్రతి సవాలు విసరడమే కాకుండా అతన్ని జాతీయ నాయకుడిగా అభివర్ణించారని అంటున్నారు.

యూపీలో ముస్లింల జనాభా 20 శాతం. అక్కడ ముస్లింలు దాదాపు 100 సీట్లలో గెలుపును ప్రభావితం చేసే స్థితిలో వున్నారు. ఆ స్థానాల్లో బీజేపీ గెలుపు ముస్లిం ఓట్ల చీలికపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడ ముస్లింలు, యాదవులే సమాజ్‎వాదీ పార్టీకి అతిపెద్ద ఓటుబ్యాంకు. ఇది కచ్చితంగా బీజేపీకి చేటు చేసేదే. అయితే, ఒవైసీ గనుక కొంతమేర ప్రభావం చూపించగలిగితే.. అఖిలేష్ యాదవ్‎కు చెందిన ముస్లిం ఓటు బ్యాంకులో చీలక రావడం ఖాయం. అంతేకాకుండా, ఒవైసీ ఏకపక్ష ప్రచార శైలి.. హిందువుల ఒక్కతాటిపైకి తెస్తుంది. హిందువులు బీజేపీకి పెద్దయెత్తున ఓటువేసేలా చేస్తుంది. ఒవైసీ ప్రచార పద్దతులు, రిలీజియస్ పోలరైజేషన్ కు దారితీయవచ్చు. అదే జరిగితే, ఈసారి బీజేపీ గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అసలే అఖిలేష్ యాదవ్‎కు, అసదుద్దీన్ ఒవైసీకి పొసగడం లేదు. ఇటీవలికాలంలో రెండు పార్టీల మధ్య వైరం బాగా పెరిగిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా అఖిలేష్‎పై విరుచుకుపడుతున్నాడు ఒవైసీ. కొన్ని నెలల క్రితం సమాజ్‎వాదీ పార్టీ టార్గెట్‎గా అనేక విమర్శలు గుప్పించాడు. తన పూర్వాంచల్ టూర్ సందర్భంగా.. నాటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించందని అన్నాడు. ఏకంగా పన్నెండు సార్లు తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను తన మిత్రుడు, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓంప్రకాష్ రాజ్‎భర్‎తో కలిసి వచ్చానని అన్నాడు. అఖిలేష్ యాదవ్ పార్లమెంటరీ నియోజకర్గమైన ఆజమ్‎గఢ్ నుంచే ఎస్పీకి వ్యతిరేకంగా తన గళం వినిపించాడు. సమాజ్‎వాదీ పార్టీ ఓటు బ్యాంకు కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టమైన సందేశం ఇచ్చాడు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ప్రజలు సమాజ్‎వాదీ పార్టీని తిరస్కరించారు. ఆ తర్వాత 2019 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సివచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు అఖిలేష్ యాదవ్. కానీ, ఈసారి ఒవైసీ నుంచే అతిపెద్ద ప్రమాదం పొంచివుంది. ఎంఐఎం సహజంగానే ముస్లిం ఓటు బ్యాంకుకు భారీగా గండికొడుతుంది. లేదంటే, ఈ ఓటు బ్యాంకు ఎస్పీ ఖాతాలోకి వెళ్లేది. దీంతో ఎస్పీ విజయానికి కారణమయ్యే మైనార్టీ ఓటు బ్యాంకు దూరమైతే,.. అది అఖిలేష్ యాదవ్‎ను మరింత సంక్షోభంలోని నెడుతుంది. అదే జరిగితే, అది కచ్చితంగా కమలనాథులకు కలిసొచ్చే అంశమే. సో.. గతంలో మాదిరిగానే, ముస్లిం ఓటు బ్యాంకును ఎస్పీకి దూరం చేస్తూ.. పరోక్షంగా బీజేపీ విజయానికి తనవంతు కృషి చేస్తున్నాడు ఒవైసీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

four × one =

Back to top button