శ్రీరాముని భవ్య మందిర నిర్మాణం ప్రతి భారతీయుడి కల. దీనికోసం శతాబ్దాల పోరాటం చేసిన చరిత్ర గురించి మనకు తెలిసిందే.. చట్టబద్దంగా నేడు ఆ కలను సాకారం చేసుకున్నాం. మన రాముని కోసం మన వంతుగా నిధి సేకరణ అభియాన్ లో భాగస్వాములమయ్యాం.. చరిత్రాత్మక నిర్మాణంలో ఇసుక రేణువయినా చాలు అనేలా పులకరించిపోయాం.
ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ధర్మం కోసం దేశం కోసం మాత్రమే తన నిర్ణయాలుంటాయి అనేది చాలా సార్లు ప్రూవ్ అయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
అందులో అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయ అభివృద్ధి, అలంకరణ కోసం రూ.640 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు చేసింది. ఈ బడ్జెట్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్‌లో కేటాయింపుల ప్రకారం నిధుల మంజూరు ఉండొచ్చు. ఇందులో భాగంగా ప్రభుత్వం అయోధ్య రామాలయానికి, అయోధ్య ధామానికి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు వేయనుంది. దీని కోసం రూ.640 కోట్లలో రూ.300 కోట్లు కేటాయించింది. ఇక అయోధ్య నగర అభివృద్ధి కోసం మరో రూ.140 కోట్లు కేటాయించింది. ఈ అభివృద్ధిలో భాగంగా… అక్కడున్న సూర్యకుంద్ ని కూడా డెవలప్ చెయ్యబోతోంది.
అయోధ్య ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.101 కోట్లు కేటాయించారు. ఈ ఎయిర్‌పోర్టుకి మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టనుంది. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు అభివృద్ధి పనుల కోసం వారణాసికి రూ.100 కోట్లు, చిత్రకూట్‌కి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో పాటూ ముఖ్యమంత్రి పర్యాటక ఆర్థిక పథకం కింద మరో రూ.200 కోట్లు కూడా కేటాయించే ప్రతిపాదన ఉంది.
“రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి ప్రాజెక్టులనూ, నగరాలనూ వాటి వాటి పురాణ, చారిత్రక అంశాల ప్రాధాన్యాన్ని బట్టీ అభివృద్ధి చేస్తాం.” అని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. చౌరీ-చౌరా ఘటన జరిగి వందేళ్లు అవుతున్న సందర్భంగా… ఏడాది పాటూ కార్యక్రమాలు జరిపేలా రూ.15 కోట్లను కూడా బడ్జెట్‌లో కేటాయించారు. లక్నోలో ట్రైబల్ మ్యూజియం కోసం రూ.8 కోట్లు, షాజహాన్‌పూర్‌లో స్వాతంత్ర్య సమరయోధుల గ్యాలరీ కోసం రూ.4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.