యోగి ఆదిత్యనాథ్ పాత బస్తీ పర్యటన వాయిదా.. ఎప్పుడంటే..?

0
772

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు, రేపు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు.. ఇలా దాదాపు 350 మంది పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోనున్నారని ముందు చెప్పగా.. ఆ పర్యటన వాయిదా పడింది. యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఉదయం యోగి అమ్మవారిని దర్శించుకుంటారని.. ఆయన పర్యటన కోసం పాతబస్తీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. పలువురు బీజేపీ ముఖ్యనేతలు కూడా ఈ రెండు రోజుల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల కార్యవర్గ సమావేశం దృష్ట్యా నగరమంతా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వీవీఐపీల దర్శనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన చాలా మంది వీవీఐపీల పర్యటన కారణంగా తమ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు చార్మినార్ చుట్టుపక్కల వ్యాపార సంస్థల యజమానులను గతంలో కోరారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రముఖులు వెళ్లే దారిలో పోలీసులు పహారా కాస్తున్నారు. బీజేపీ భద్రతా ఏర్పాట్లలో భాగంగా శనివారం చార్మినార్ చుట్టూ ఉన్న పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో సహా కొన్ని వందల మంది పోలీసులను మోహరించారు. చార్మినార్ చుట్టూ కూడా ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు.