ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహించారు. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ముఖ్యమంత్రి మళ్లీ సర్క్యూట్ హౌస్‌కు వచ్చారని ప్రాథమిక సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ విమానంలో ఆయన లక్నోకు బయలుదేరారు. “వారణాసి నుంచి లక్నోకు బయలుదేరిన తర్వాత సీఎం హెలికాప్టర్‌ను ఒక పక్షి ఢీకొట్టింది, ఆ తర్వాత అది ఇక్కడ దిగాల్సి వచ్చింది” అని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మను ఉటంకిస్తూ వార్తా సంస్థ PTI పేర్కొంది. ముఖ్యమంత్రి లక్నో వెళ్లేందుకు అధికారులు ప్రభుత్వ విమానం ఏర్పాటు చేశారు. బాబట్ పూర్ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గాన యోగి బాబట్ పూర్ విమానాశ్రయానికి వెళ్లారు.
సీఎం శనివారం వారణాసికి వచ్చి కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేయడంతో పాటు అభివృద్ధి పనులు, శాంతిభద్రతలను సమీక్షించారు. వారణాసిలో రాత్రి బస చేసిన ఆయన ఆదివారం ఉదయం లక్నోకు బయలుదేరారు. శనివారం ఆదిత్యనాథ్ లక్నోలో స్వామిత్వ పథకం కింద 11 లక్షల కుటుంబాలకు ఆన్లైన్ గ్రామీణ నివాస హక్కుల పత్రాలను పంపిణీ చేశారు. లోక్‌భవన్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.