యూపీ సీఎం యోగి బుల్డోజర్లు దూకుడు మీదున్నాయి. అక్రమ నిర్మాణాలపైకి బుల్లెట్లలా దూసుకుపోతున్నాయి. లీడర్ల ఇళ్లను సైతం లెక్క చేయకుండా అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా మారుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా వదిలిపెట్టడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీకి అనుకొని ఉన్న ఘజియాబాద్ లోని ఉస్మాన్ గర్హి ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లు కూల్చివేశాయి. ఈ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఉస్మాన్, అతని బంధువులకు చెందిన ఇండ్లు కూడా ఉన్నాయి. చెరువును కబ్జా చేసి అక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వాటిని కూల్చివేశారు.
1990లో మూడు దశాబ్ధాల క్రితం 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరు మీద ఉస్మాన్ గర్హి కాలనీని నిర్మించినట్లు ఎస్పీ నేతపై ఆరోపణలు ఉన్నాయి. అతను తన బంధువులకు కొన్ని ఫ్లాట్లను ఇవ్వగా.. మరికొన్ని ఇతర ప్రజలకు విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో దాదాపు 400 ఇళ్లను నిర్మించినట్లు లెక్కలు వేశారు. మరోవైపు గతంలో ఉస్మాన్ పై ముస్సోరి పోలీస్టేషన్ లో భూ కబ్జా, ఇల్లు బద్దలు కొట్టడం, దోపిడి కేసులు ఉన్నట్లు కూడా అధికారుల విచారణలో తేలింది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 67వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ల్యాండ్ మాఫియా బారి నుంచి విముక్తి చేశారు. బుల్డోజర్ల సహయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా యోగికి బుల్డోజర్ బాబా అనే సంపాదించుకున్నారు. యోగి మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్రమ ఇళ్లు, మాఫియా, నేరస్థుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు బుల్డోజర్లను ఉపయోగించారు. ఆ తర్వాత రెండో సీఎం అయ్యాక బుల్డోజర్లను రాజ్యాధికారానికి చిహ్నంగా గుర్తించడం ప్రారంభించారు.
బుల్డోజర్ ఇప్పుడు ఇదే దేశంలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే మతోన్మాదుల పాలిట సింహ స్వప్నంగా మారిన బుల్డోజర్లను అన్ని రాష్ట్రంలో రంగంలోకి దింపుతున్నారు. యూపీలో మొదలైన ఈ బుల్డోజర్ల విప్లవం మిగతా రాష్ట్రాలకు పాకుతోంది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బుల్డోజర్లు శాషిస్తున్నాయి. ఓ వర్గం సృష్టిస్తున్న అరాచకాలకు జేసీబీలు అడ్డుగా నిలుస్తున్నాయి. కొంతమంది హింసావాదులకు బుద్ది చెప్పేందుకు వాటిని అస్త్రంగా చేసుకొని ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. అక్రమార్కులు, మతోన్మాదులను ఎదుర్కొనేందుకు బుల్డోజర్లు ఉపయోగపడుతున్నాయి. ఇక యూపీలో యోగి బుల్డోజర్ ను ప్రచార సాధనంగా ఉపయోగించారు. ఇది తన ప్రభుత్వం మాఫియాపై ఎలా విరుచుకుపడిందో, రాష్ట్రంలో అభివృద్ధికి చిహ్నంగా ఉందని చెప్పడానికి ఇది సంకేతమని గతంలోనే స్పష్టం చేశారు. ఇలా యూపీలో బుల్డోజర్ల హవా నిర్విరామంగా కొనసాగుతోంది.