నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేరు ప్రస్తావించకుండా గట్టి వార్నింగ్ ఇచ్చారు. పౌరసవరణ చట్టం (CAA) పేరుతో ఉత్తరప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టవద్దని యోగి ఆదిత్యనాథ్ కోరారు. అలా రెచ్చగొట్టే వారికి తాము గట్టి సమాధానం ఇవ్వగలమని అన్నారు.
పౌరసవరణ చట్టం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే వ్యక్తిని హెచ్చరిస్తున్నానని సీఎం యోగి బహిరంగ సభలో చెప్పుకొచ్చారు. నేను చాచా జాన్ మరియు అబ్బా జాన్ అనుచరులను జాగ్రత్తగా వినమని హెచ్చరించాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే.. ఎలా కఠినంగా వ్యవహరించాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు అని అన్నారు.
సమాజ్ వాదీ పార్టీ ఆదేశాల మేరకు ఒవైసీ ఉత్తరప్రదేశ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని యోగి విమర్శించారు. ‘‘రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ పిలుపు మేరకు ఒవైసీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అందరికీ తెలుసు. అయితే, ఉత్తరప్రదేశ్ అల్లర్లు లేని రాష్ట్రంగా పిలువబడే విధంగా ముందుకు సాగుతోందని” కాన్పూర్‌లో జరిగిన ర్యాలీలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒవైసీ యూపీలో ఏం చెప్పారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటి నుండి AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ CAAని రద్దు చేయాలని నిరసనలు చేపట్టాలని తన అనుచరులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తన ప్రచారంలో “ప్రభుత్వం NPR మరియు NRC కోసం చట్టాలను రూపొందిస్తే, మేము మళ్లీ రోడ్లపైకి వచ్చి ఇక్కడే షాహీన్‌బాగ్‌ను సృష్టిస్తాము. నేనే ఇక్కడికి వస్తాను. CAAని కూడా రద్దు చేయండి” అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలను చేశారు. కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడిన అసదుద్దీన్ “మేము CAAని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రజల మతాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని రూపొందించడం ద్వారా మోదీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలి, లేకుంటే ముస్లింలు మళ్లీ రోడ్లపైకి వస్తారు” అని చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లో 2022 ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నందున UP ఎన్నికలను పలు రాజకీయ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సంవత్సరం, AIMIM కూడా UP ఎన్నికలలో పోటీ చేస్తోంది. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ మరియు SP కంటే తమకే మద్దతు ఇస్తారని అసదుద్దీన్ భావిస్తున్నారు.