పండుగ రోజు బంధువులు వస్తారు.. కానీ వాళ్ల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. అంతేకాదు.. టపాసులు, మిఠాయిలతో పాటూ బహుమానాలను కూడా అందించి ఆశ్చర్యపరిచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి జన్ ఆవాస్ యోజన లబ్ధిదారుల ఇళ్లను స్వయంగా సందర్శించి దీపావళికి టపాసులు, మిఠాయిలను బహుమతిగా ఇచ్చారు. ‘మీ కలలన్నీ నెరవేరుస్తానని మా హామీ’ అని యోగి వారితో అన్నారు. కాషాయ వస్త్రధారణతో ఎప్పుడూ ఉండే యోగి ఆదిత్యనాథ్ ఆ కుటుంబంలోని పిల్లలతో మాట్లాడారు.. టపాసులు నీకోసమే అని పిల్లాడితో చెప్పడంతో తెగ మురిసిపోయాడు. యోగి ఆదిత్యనాథ్ తెచ్చిన బహుమతులతో ఆ చిన్నారి ఆనందంగా కనిపించాడు. యోగి ఆదిత్యనాథ్ తమను ఇంటికి వచ్చాడని తెలియగానే.. తమ ఇంట్లోకి ప్రవేశించాలని ఆ మహిళ చెప్పింది. యోగి ఆదిత్యనాథ్ ఆమె ఇంటిలోకి వెళ్ళగానే ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోని 75000 మంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్‌గా కీలను అందజేశారు. ఈ లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలో దీపావళి, ఛత్ పూజ మొదలైన అన్ని రాబోయే పండుగలను జరుపుకోగలుగుతున్నందుకు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు అందించిన ఇళ్లలో 75 శాతం ఇళ్ల యాజమాన్య హక్కులు మహిళలకు దక్కడం మరింత సంతోషాన్ని కలిగించే విషయమని ప్రధాని అన్నారు.
ఇక దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతులతో ప్రపంచ రికార్డు అందుకుంది. 9 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య నగరం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దీపావళిని పురస్కరించుకుని సరయు నదీ తీరంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. రామ్ కీ పైడీ ప్రాంతంలో ఇలా చమురుతో దివ్వెలు వెలిగించడం వరుసగా ఐదోసారి కూడా గిన్నిస్ రికార్డు పుటల్లోకెక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ దీపోత్సవం నిర్వహించారు. రికార్డు సాధించినట్టు నిర్ధారించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆ మేరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.