ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని సందర్శించారు. 50 మంది దాకా యూనివర్సిటీకి చెందిన ఉద్యోగులు, రిటైర్ట్ ఉద్యోగులు కరోనా కారణంగా మరణించడంతో యోగి ఆదిత్యనాథ్ ఆ ప్రాంతానికి వెళ్లారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించిన తర్వాత అక్కడికి వెళ్లిన మొదటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించారు.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన పలువురికి కరోనా మహమ్మారి సోకింది. యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు కూడా కరోనా బారిన పడ్డారు. అక్కడ కొత్త వేరియంట్ ఎక్కువగా ప్రబలుతోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలీఘర్ యూనివర్సిటీని సందర్శించారు. అలీఘర్ ప్రాంతంతో పాటూ, మథుర, ఆగ్రాలలో కూడా కోవిడ్ పరిస్థితులపై సమావేశాన్ని నిర్వహించారు. గత 20-25 రోజుల వ్యవధిలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన 15 మంది అధ్యాపకులు, 25 మంది రిటైర్డ్ అధ్యాపకులు, 15 మంది స్టాఫ్ మెంబర్లు, 2 స్కూల్ టీచర్లు కరోనా కారణంగా మరణించారు. దీంతో ఏఎంయు వైస్ ఛాన్స్ లర్ తారిఖ్ మన్సూర్ ఐసిఎంఆర్ కు లెటర్ కూడా రాశారు. త్వరగా సరైన చర్యలు తీసుకోవాలని.. తమ ప్రాణాలను కాపాడాలని అన్నారు. పరిస్థితులను సమీక్షించిన యోగి ఆదిత్యనాథ్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కావాల్సిన మెడికల్ సప్లై, ఆక్సిజన్, అంబులెన్స్ లను అందిస్తామని అన్నారు.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ప్రాంతంలో కరోనా ప్రబలుతున్న సమయంలో కనీసం చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అదే ముఖ్యంగా కరోనా ప్రబలడానికి కారణమని తెలిపారు. ఒక్కసారిగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులకు, స్టాఫ్ కు కరోనా సోకిందని తెలియగానే ఆ ప్రాంతమంతా షాక్ కు గురైంది. తమకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. అలాగే కొత్త వేరియంట్ విషయంలో ఆందోళనలు అనవసరమని తేల్చి చెప్పారు. భయపడకండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందంటూ ముఖ్యమంత్రి ఆఫీసు నుండి వారికి మెసేజీ వెళ్ళింది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలోకి ఇప్పటి వరకూ ఏ యూపీ ముఖ్యమంత్రి కూడా అడుగుపెట్టలేదు. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అడుగుపెట్టారు.