లాక్ డౌన్ సమయంలో పనులు లేక దేశ వ్యాప్తంగా ఎంతో మంది రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉపాధి లేక.. ఎక్కడ వెళ్ళాలో తెలియక చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అటువంటి వాళ్లను ఆదుకోడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 23 లక్షల మంది రోజువారీ కూలీల అకౌంట్లలోకి 230 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నామని, పేదలను ఈ కష్ట కాలంలో ఆదుకోడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. “ఇల్లు కట్టడం, అనారోగ్యానికి సరైన చికిత్స, విద్య ఖర్చు లేదా ఏదైనా ప్రమాదంలో ఆర్థిక సహాయం అవసరం, రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా మీతో ఉంటుంది” అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రభుత్వానికి సహాయం చేసినందుకు రోజువారీ కూలీలు, కార్మికులను యోగి ప్రశంసించారు.
ప్రభుత్వం, ప్రజల సమిష్టి కృషి ద్వారా, ఉత్తర ప్రదేశ్ దారుణమైన పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చిందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 కోట్ల జనాభా కలిగి ఉందని.. మన జనాభాలో సగం ఉన్న రాష్ట్రాలు రోజువారీగా మనకంటే ఎక్కువ కరోనా కేసులు నమోదు చేస్తూ ఉన్నాయని ఆయన అన్నారు. యుపికి ఉత్తమ రికవరీ రేటు ఉందని తెలిపారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉన్నప్పటికీ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయని తెలిపారు. కార్మిక సోదరులు సంపూర్ణ అంకితభావం మరియు కృషి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర భారత్’ కలని సాకారం చేయడంలో గణనీయమైన కృషి చేశారని రాష్ట్రంలోని వివిధ జిల్లాల కార్మికులతో యోగీజీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాన్ని తీసుకునే ముందు కార్మికుల పని, ఇల్లు, కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు.
యోగి ఆదిత్యనాథ్ ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఇది చిన్న దుకాణదారులు, రోజువారీ కూలీ కార్మికులు, రిక్షా / ఇ-రిక్షా పుల్లర్లు, పోర్టర్లు, బార్బర్లు, దుస్తులను ఉతికే యంత్రాలు ఉన్న షాపుల వాళ్లు, కొబ్బరికాయలు, మిఠాయిలు అమ్మేవారు మొదలైన వారికి సహాయపడుతుంది. యోగి అర్హత గల అభ్యర్థులను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని.. యోగి ప్రభుత్వం తెలిపింది. ఏ రంగంలో ఉన్నా.. ప్రతి కార్మికుడికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక రూ.5,000,00 బీమాను అందిస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నం పూర్తి అంకితభావంతో జరుగుతోందని తెలిపారు. ప్రజలు టీకాలు వేయించుకోవాలని, కోవిడ్ ప్రోటోకాల్స్‌ను అనుసరించాలని సిఎం యోగీజీ విజ్ఞప్తి చేశారు.