పోలీసుల కస్టడీలో ఇటీవల మరణించిన వ్యాపారవేత్త ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ గా తీసుకున్నారు. తీవ్రమైన తప్పులు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. తప్పులు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులను డిస్మిస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొందరు పోలీసు అధికారులు కొన్ని అనధికారిక పనులు చేస్తున్నట్లు రిపోర్టులు అందాయని, ఇలాంటి వ్యక్తులకు పోలీసు శాఖలో స్థానం లేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇలాంటి కేసులతో సంబంధాలున్న పోలీసు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది.
ఇటీవల పోలీసు కస్టడీలో ఒక వ్యాపారవేత్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్తతో యూపీలో పోలీసుల క్రూరత్వంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకారం కాన్పూర్ సంఘటన తరువాత తీవ్రమైన నేరాలలో పాల్గొన్న పోలీసు అధికారులు/సిబ్బంది విధుల నుండి తొలగించాలని ఆదేశించారు. కళంకిత సిబ్బందికి ముఖ్యమైన పోస్టింగ్ లు ఉండవని కూడా తెలిపారు.
హోటల్‌లో హత్యకు గురయిన వ్యాపారి ఘటనపై యూపీ సర్కార్ స్పందించింది. చనిపోయిన కాన్పూర్‌కి చెందిన వ్యాపారి మనీశ్ గుప్తా కుటుంబాన్ని గురువారం కలిశారు. అతని భార్య మీనాక్షి గుప్తాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే రూ.10 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు. కాన్పూర్ డెవలప్ మెంట్ అథారిటీ విభాగంలో ఓఎస్డీ పోస్టు మీనాక్షి గుప్తాకు అందించనున్నారు.
ఏ ఘటన చోటు చేసుకుంది
ఘటనకు సంబంధించిన వివరాలు:
గోరఖ్‌పూర్ ఓ హోటల్‌లో ముగ్గురు వ్యాపారులు సమావేశం అయ్యారు. రెగ్యులర్ చెకప్ కోసం పోలీసులు వచ్చారు. వారిలో ఒకరు మనీశ్ కుమార్ గుప్తా ఉన్నారు. అర్ధరాత్రి దాటాక వచ్చి ఐడీ కార్డు చూపాలని వేధింపులకు గురిచేశారు. మిగతా వ్యాపారులతో గొడవకు దిగారు. మనీశ్ ప్రశ్నించగా.. ఇద్దరిని బయటకు పంపించారు. అతనిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం, తలపై రక్తం వచ్చిందని అతని స్నేహితుడు తెలిపారు. మద్యం సేవించిన పోలీసులు తమ గదికి వచ్చారని మిగిలిన వ్యక్తులు ఆరోపించారు. వారి చేతిలో తుపాకులు కూడా ఉన్నాయని..తమను ఐడీ కార్డులు చూపించమని బెదిరించారని.. దాడి చేశారని తెలియజేశారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే సమాచారం వచ్చిందని వివరించారు. అందుకే రైడ్ నిర్వహించామని చెప్పారు. వివిధ నగరాలకు చెందిన వ్యాపారులు హోటల్ గదిలో ఉన్నారని గోరఖ్ పూర్ పోలీస్ చీఫ్ విపిన్ తాడా చెప్పారు. మేనేజర్ సాయంతో గదిలోకి ప్రవేశించామని.. గదిలో అనుకొకుండా జరిగిన ఘటనలో వ్యాపారి గాయపడ్డారని అన్నారు. వెంటనే అతనిని ఆస్పత్రికి కూడా తరలించారని చెప్పారు. మృతుడి భార్య మాత్రం చనిపోయే 10 నిమిషాల ముందు కూడా తనతో మాట్లాడారని చెప్పారు. పోలీసులు వేధించి.. దాడి చేసి హతమార్చారని ఆరోపించారు.