National

గొప్ప నిర్ణయం తీసుకున్న యోగి సర్కార్

రాబోయే ఒలింపిక్స్ లో భారత్ కు మరిన్ని పతకాలు రావాలని ఇప్పటికే ప్రభుత్వం సంకల్పించింది. ఆటగాళ్లకు మరిన్ని సదుపాయాలు అందించడమే కాకుండా వారిని ప్రోత్సహించడానికి కూడా ఏర్పాట్లను చేస్తూ వెళుతోంది. ఇక పలు రాష్ట్రాలు కూడా అదే బాటలో ముందుకు వెళుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా ప్రభుత్వం హాకీని దత్తత తీసుకొని, ఆ క్రీడ అభివృద్దికి కృషి చేస్తున్నట్లే.. రెజ్లింగ్‌ను దత్తత తీసుకొని, ఈ క్రీడ అభివృద్ధికి సహకరించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కోరింది. వారు కోరిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకారం తెలిపారు. 2032 వరకూ రెజ్లింగ్‌పై రూ.170 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించింది. ఒడిశా రాష్ట్రం క్రీడాభివృద్ధికి ఇంత చేస్తుంటే.. యూపీ వంటి పెద్ద రాష్ట్రం రెజ్లింగ్‌కు ఎందుకు మద్దతివ్వకూడదు? ఇదే అంశాన్ని ప్రభుత్వానికి తెలుపగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకరించారని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. 2024 ఒలింపిక్స్ వరకూ ఏటా రూ.10 కోట్లు, ఆపై 2028 ఒలింపిక్స్‌ వరకూ ఏటా రూ.15 కోట్లు, ఆ తర్వాత 2032 ఒలింపిక్ క్రీడల వరకూ ఏటా రూ.20 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రతిపాదన చేసినట్లు సింగ్ తెలిపారు. దీనికి యూపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. ఈ నిధులతో క్యాడెట్ స్థాయి రెజ్లర్లకు కూడా స్పాన్సర్స్ లభిస్తారని, నేషనల్ ఛాంపియన్లకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వగలుగుతామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. రెజ్లింగ్ అభివృద్ధి కోసం ఇప్పటికే డబ్ల్యూఎఫ్ఐతో టాటా మోటార్స్ భాగస్వామ్యం ఉంది. 2018లో జరిగిన ఈ ఒప్పందాన్ని మరోసారి కొత్తగా పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. యూపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో క్యాడెట్ స్థాయి రెజ్లర్లను కూడా విదేశీ పర్యటనలకు తీసుకెళ్లగలుగుతామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అథ్లెట్ల కోసం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. హాకీ భారత్ లో తిరిగి పుంజుకోవడానికి కారణమైన ఒడిశా రాష్ట్రాన్ని ఇప్పటికే ప్రశంసలతో ముంచెత్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two + three =

Back to top button