More

    సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ ఆస్తుల వివరాలివే.. ఆయనకంటూ ఉన్నవేమిటంటే

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం కోటి రూపాయ‌ల‌ 54 లక్షల 94 వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. రూ.12 వేలు విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, రూ. లక్ష విలువ ఉండే రివాల్వర్‌, రూ.80 విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ.49 వేల విలువ ఉండే బంగారు చెవి రింగు, రూ.20 వేల రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి అఫిడవిట్ లో వెల్ల‌డించారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని, త‌న‌కు సొంత వాహనం కూడా లేదని తెలిపారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని, త‌న‌పై పెండింగ్‌లో ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని తెలిపారు.

    గోరఖ్‌పూర్ నుంచి ఐదు పర్యాయాలు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానానికి మార్చి 3న యూపీ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ జరగనుంది. గోరఖ్‌పుర్‌ శాసనసభ స్థానం నుంచి ఆయ‌న నామినేష‌న్ వేశారు.

    తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ మీరట్, ఘజియాబాద్, అలీగఢ్, హాపూర్, నోయిడాలోని ఓటర్లను ఉద్దేశించి వర్చువల్ గా ‘జన్ చౌపాల్’ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రసంగించారు. ‘జన్ చౌపాల్’లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, జాతీయవాదం, అభివృద్ధి మరియు సుపరిపాలన వంటి అంశాలపై తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఫిబ్రవరి 6వ తేదీన బీజేపీ తన మేనిఫెస్టో (సంకల్ప్ పత్ర)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. “2017లో 212 వాగ్దానాలు చేసాము. గత ఐదేళ్లలో మేము మహిళలు, రైతుల భద్రత, సాధికారత కోసం అలాగే పేదలకు ఉపాధి కల్పించడం కోసం పని చేసాము, నేడు, ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తున్నారు” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్‌ పరిపాలన వ్యవస్థను గూండాలు, మాఫియాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఈరోజు మహిళలకు భద్రతతో కూడిన వాతావరణం నెలకొని, పెట్టుబడులు పెరిగాయని, వ్యాపారులు, యువత వలసలు వెళ్లడం కూడా ఆగిపోయాయని.. ఇప్పుడు మాఫియా, నేరగాళ్లు వలసలు వెళ్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

    రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రోజు ఉదయం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. 403 స్థానాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 39.67 శాతం ఓట్లను సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 47 సీట్లు, బీఎస్పీ 19 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

    Trending Stories

    Related Stories