2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. “నేను ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.. పార్టీ చెప్పిన చోట నుండి పోటీ చేస్తాను” అని ఆయన విలేకరులతో అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాతే ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. ఎక్కడ్నుంచి పోటీ చేసే విషయంపై అప్పుడే స్పష్టత వస్తుందన్నారు. ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామని సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయంలో చాలా మార్పులు తీసుకుని వచ్చామని అన్నారు. గత నాలుగేళ్లలో ఎలాంటి అల్లర్లు జరగలేదని, దీపావళితో సహా అన్ని పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారని ఆయన అన్నారు. మంచి రహదారి కనెక్టివిటీ, భద్రత కారణంగా విదేశాల నుండి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందని యోగి చెప్పారు. ఇప్పుడు బయటి నుంచి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. గతంలో యూపీ రోడ్లలో గుంతలు, కుంటలు ఉండేవని.. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌వేలకు, నాలుగు లైన్ల రోడ్ల నెట్‌వర్క్‌కు పేరుగాంచిందని ఆయన అన్నారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగాలు పొందారు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎవరూ వేలు పెట్టి చూపించలేకపోయారు. ఇవన్నీ ప్రభుత్వం సాధించిన వివిధ విజయాలు అని అన్నారు. తన పదవీ కాలంలో శాంతి భద్రతలను కాపాడామని తెలిపారు.