More

  అసదుద్దీన్ పై కాల్పుల ఘటన గురించి స్పందించిన యోగి ఆదిత్యనాథ్

  ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా కొందరు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఒవైసీ వాహనంపై కాల్పులు జరపడం సహించరానిదని యోగి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటివి ఏమాత్రం ఆమోదయోగ్యం కానివని.. తాము బ్యాలెట్ ని మాత్రమే నమ్ముతామని, బుల్లెట్ ని కాదని చెప్పారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి తమ ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. ఎన్నిక ప్రసంగాలలో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నాయకులు వ్యవహరించాలని అన్నారు. ఓటు బ్యాంకు కోసం ప్రజల విశ్వాసంతో ఆడుకోకూడదని అన్నారు.

  యూపీ కాల్పుల నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఒవైసీ దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తనపై జరిగిన బుల్లెట్‌ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. నాకు జెడ్‌ కేటగిరీ రక్షణ వద్దు.. మీ అందరితో సమానంగా ఎ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. నేను పుట్టింది ఈ భూమ్మీదే.. చచ్చినా ఔరంగాబాద్‌ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను. బుల్లెట్‌ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదన్నారు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా.. నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే.. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే అని అన్నారు. నాపై దాడి చేసిన వారికి బుల్లెట్‌పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్‌బుక్‌లో ఎవరైనా ఒక క్రికెట్‌ జట్టును అభినందిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగిస్తున్నారు. నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్‌ కోరారు.

  ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించారు. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.

  Trending Stories

  Related Stories