National

దేశంలో కరోనా టచ్ చేయని చోటిదే..!

దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నవేళ.. అక్కడ మాత్రం ఆ మహమ్మారి పేరు వినిపించడం లేదు. మూడు వేల మంది ఒకే చోట నివసిస్తున్నా.. ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. యోగా, ఆయుర్వేదం, కఠిన నియమాలు, ఆంక్షలు, హద్దుమీరితే శిక్షలు.. ఈ పంచసూత్రాలే వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు కదూ..! తమిళనాడులోని కోయంబత్తూరులో కొలువైనా ఇషా ఫౌండేషన్ ఆశ్రమం. ఆశ్రమంలోని వాలంటీర్లు కరోనాను దరిచేరనివ్వడమే కాదు.. చుట్టు పక్కల 43 గ్రామాల్లోకి రాకుండా చూస్తున్నారు.

3 వేల మందికిపైగా వలంటీర్లు కఠిన నియమాలను పాటించడం వల్లే.. కరోనాను నిలువరించగలిగామని.. ఇషా ఫౌండేషన్ సెంటర్ కోఆర్డినేటర్ మాతా జయత్రి చెప్పారు. ఏడాది కాలంగా కరోనా ఆంక్షలు, నియమాలను కఠినంగా పాటిస్తున్నామని.. అతిథుల రాకపై ఆంక్షలు విధించడమే కాకుండా.. బయట నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశామని తెలిపారు. ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే కఠిన శిక్షలు వేస్తున్నామని.. చేతికి ప్లకార్డు ఇచ్చి రెండు గంటల పాటు నిలబెడుతున్నామని తెలిపారు. అంతేగాకుండా ఎప్పటికప్పుడు అందరికీ జ్వరం చెక్ చేస్తున్నామని, భౌతిక దూరం పాటిస్తున్నామని, ఆశ్రమాన్ని శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు.

ఆశ్రమంలోని వారు కరోనా బారిన పడకపోవడానికి మరో కారణం యోగా. రోజూ మూడు నిమిషాల పాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచే ‘సింహ క్రియ’ అనే యోగాసనాన్ని తప్పనిసరి చేశారు. ఆశ్రమంలో పచ్చి కూరగాయాలు, పండ్లు వంటి సాత్వికాహారమే ఎక్కువగా తీసుకుంటున్నామని ఆశ్రమ మెడికల్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుమన్ చెప్పారు. రోజూ ఉదయాన్నే 4 గంటల 30 నిమిషాలకే నిద్ర లేస్తామని, పరగడుపున వేప ఆకులు, పసుపు ముద్దలు మింగి గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగుతామని మాతా జయిత్రి చెప్పారు. రోజూ రెండు సార్లు ఖాళీ కడుపుతో నీలవేంబు కషాయం అనే ఆయుర్వేద ద్రావణాన్నీ తీసుకుంటామని ఆమె తెలిపారు.

అయితే తమ నియమ, నిబంధనలను కేవలం ఆశ్రమానికే పరిమితం చేయలేదని.. ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న 43 గ్రామాల్లోనూ ఆచరింపజేస్తున్నామని అన్నారు. అందుకే కోయంబత్తూర్ నగరంలో భారీ కేసులు నమోదవుతున్నా.. ఆయా పల్లెల్లో మాత్రం చాలా చాలా తక్కువ కేసులు వచ్చాయని చెప్పారు. చుట్టు పక్కల 13 పల్లెల్లో ఒక్క కేసు కూడా లేదంటే నమ్ముతారా..? అని ఓ గ్రామ పంచాయతీ పెద్ద చెప్పుకొచ్చారు. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లరని, అవసరం ఉంటేనే ఇలా వెళ్లి అలా వచ్చేస్తారని చెప్పారు. ఆశ్రమ నిర్వాహకులు 43 గ్రామాల్లో లక్ష మందికి 15 వనమూలికలతో తయారుచేసిన ఆయుర్వేద కషాయాన్ని రోజూ అందిస్తున్నారు. అంతేకాకుండా యోగాసనాలనూ నేర్పిస్తున్నారు. కరోనా నిబంధనలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అందువల్లే ఆ ప్రాంతంలోకి కరోనా అడుగుపెట్టలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × four =

Back to top button