More

    సంచలన ప్రకటన చేసిన యడ్యూరప్ప

    కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గత కొద్దిరోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో మార్పు ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తూ ఉండగా.. తాజాగా ఆ వార్తలే నిజమయ్యాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడ్యూరప్ప మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అంటూ చెప్పుకొచ్చారాయన.

    75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు యడ్యూరప్ప. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని, కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందని అన్నారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని కాస్త నిరాశతో చెప్పుకొచ్చారు. ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని అయినప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపానని అన్నారు. కర్ణాటక ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని యడ్యూరప్ప అందించనున్నారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రేసులో ముగ్గురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ప్ర‌హ్లాద్ జోషి, సీటీ ర‌వి, మంత్రి మురుగేష్ నిర్వాణీ, ముఖ్య‌మంత్రి అశ్వ‌త్థ నారాయ‌ణ పేర్లు ఉన్నాయి. ప్ర‌హ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా ప‌నిచేస్తుండ‌గా, సీటీ ర‌వి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. వీరు కాకుండా కొత్త వ్యక్తికి పదవిని ఇచ్చి.. బీజేపీ మరోసారి తనదైన మార్కు రాజకీయం చూపించే అవకాశం ఉంది.

    బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని పద‌వుల నుంచి త‌ప్పించే సంప్ర‌దాయం ఉన్న‌ది. ఈ సంప్ర‌దాయాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు గౌర‌విస్తూ వ‌స్తున్నారు. త‌న విష‌యంలో కూడా ఇదే విధ‌మైన సంప్ర‌దాయం ఉంటుంద‌ని, అందులో ఎలాంటి మార్పు లేద‌ని యడ్యూరప్ప గతంలోనే చెప్పారు.

    Related Stories